వాషింగ్టన్: ఇరాన్‌తో భీకర యుద్ధం సాగుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త మెలిక పెట్టాడు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారసుడి ఎంపికలో తాను తప్పక పాల్గొనాలని కండిషన్ పెట్టాడు. వెనిజులాలో మదురో స్థానంలో డెల్సీ రోడ్రిగ్జ్ ఎంపిక జరిగిన మాదిరిగానే తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక జరగాలన్నారు.
ఇక, ఖమేనీ స్థానంలో అతని కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఇరాన్ నెక్ట్స్ సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఉందన్నాడు. కానీ మోజ్తాబా ఖమేనీ నియామకం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. ఈ ప్రతిపాదనకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేదు.
మరోవైపు ఇరాన్ కూడా యుద్ధం ఆపేందుకు గల్ఫ్కంట్రీస్కు కొన్ని షరతులు పెట్టింది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, టర్కీ వంటి గల్ఫ్ దేశాలు అమెరికన్లను వారి భూభాగాల నుండి బహిష్కరించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అలాగే.. గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఎస్ సైనిక స్థావరాలను పూర్తిగా తొలగించాలని కోరింది. ఇలాగైతే గల్ఫ్ దేశాలు ఇరాన్ మిస్సైళ్ల ముప్పు తప్పించుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది.
కాగా, గత వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించాయి. మరోవైపు ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా ప్రతిస్పందిస్తోంది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్పైన మిస్సైళ్లు, బాంబులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ రణరంగాన్ని తలపిస్తోంది.
